బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2026–27 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన పీయూసీ 1 విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం మంగళవారం రెండో రోజు కొనసాగింది. క్యాంపస్‌లోని ఎస్‌ఏసీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్రమశిక్షణ, పరీక్షల నిర్వహణ, క్యాంపస్ జీవనం, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ కే.గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగిన నిపుణులుగా తీర్చిదిద్దడమే ఆర్జీయూకేటీ లక్ష్యమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఇక్కడ లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.


