ఉట్నూర్‌రూరల్: విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకై క లక్ష్యం కావాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘విద్యాజ్యోతి–సామర్థ్యాభివృద్ధి–సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తరగతి గదిలో కార్యకలాపాల ఆధారిత బోధన, ఉత్తమ బోధనా పద్ధతులు, వాస్తవ జీవిత ఉదాహరణలను ఉపయోగించి పాఠ్యాంశాన్ని దృశ్య రూపంలో అర్థమయ్యేలా బోధించాలన్నారు. విద్యార్థుల్లో లక్ష్య నిర్దేశం పెంపొందించి, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం , సమగ్ర వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా కృషి చేయాలన్నారు. ఐదు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో చందన్, ఏపీవో పీవీటీజీ భాస్కర్, డీటీడీవో నిర్మల్ నిహారిక, ఏసీఎంవో జగన్, ఎస్‌వో పార్థసారథి, జీసీడీవో ఛాయ, బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మానిక్‌రావు, రిసోర్స్ సభ్యులు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన తెలుగు, ఆంగ్లం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


