నార్నూర్: ప్రభుత్వ ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని నమ్మించి అమాయక నిరుద్యోగుల వద్ద నుంచి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసిన నలుగురు నిందితులను నార్నూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తొడసం గజానంద్ వద్ద రూ.4 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రం ఇచ్చినట్లు రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో నార్నూర్‌కు చెందిన చహకాటి లింబారావు, ఉట్నూర్‌కు చెందిన జాడి ప్రవీణ్ కుమార్, కెరమెరికి చెందిన రామ్టెకి ఉదయ్ కిరణ్, జైనూర్‌కు చెందిన జాడి రవీందర్ ప్రభుత్వ ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జన్నారం ప్రాంతానికి చెందిన ముగ్గురు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరితో పాటు మొత్తం సుమారు 25 మంది నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఇంకా బాధితులు ఉంటే ముందుకు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.


