బాసర: జ్ఞానం, విద్య, ఆధ్యాత్మికతకు ప్రతీకగా విరాజిల్లుతున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం ఎంతో విశిష్టమైనదని వేద పండితుడు శశికాంత్ జోషి అన్నారు. గురుపౌర్ణమి (వ్యాస పౌర్ణమి) ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం బాసర క్షేత్ర వైభవంపై ఆయన ప్రవచనం చేశారు. క్షేత్రంలోని విశిష్టతలు, ఉప ఆలయాల ప్రాశస్త్యం, గోదావరి నది పవిత్రత, అమ్మవారి ఆరాధనతో కలిగే ఆధ్యాత్మిక ఫలితాలను భక్తులకు వివరించారు. దుర్బుద్ధి తొలగి మంచి గుణాలు అలవడాలంటే జ్ఞానం అవసరమని, ఆ జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అమ్మవారి సన్నిధి బాసరలో ఉండటం క్షేత్రం ప్రత్యేకత అన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్యాభివృద్ధి, జ్ఞానసంపద కలుగుతుందన్నారు. ఆలయ సమీపంలోని బొర్రా గణేశుడిని ప్రార్థిస్తే సకల విద్యల్లో ప్రావీణ్యం కలుగుతుందన్నారు. పూర్వకాలంలో పుష్కర జలాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసేవారన్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో స్థాపిత దేవతా పూజ, మూలమంత్ర హోమం, వేద పారాయణం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.


