మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ నెల 23న రోడ్డు ప్రమాదానికి సంబంధించి హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్లు ఎస్సై మధుసూధన్ ఆదివారం తెలిపారు. తిర్యాణి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన మల్యాల మొగిళి(50) మంచిర్యాలలో దోభి(చాకలి) పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో ఈ నెల 23న ఉదయం పని నిమిత్తం సైకిల్‌పై బస్టాండ్ వైపు నుంచి బెల్లంపల్లి చౌరస్తా వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు మొగిళిని ఢీ కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి కారులో నుంచి దిగి క్షతగాత్రుడిని చూసి అక్కడే వదిలేసి పారిపోయారు. అనంతరం స్థానికులు మొగిళిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. మొగిళికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


