● సిజేరియన్లకే మొగ్గు చూపుతున్న యాజమాన్యాలు, డాక్టర్లు ● ప్రభుత్వం చెబుతున్నా సాధారణ ప్రసవాలకు ‘నో’ ● ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నార్మల్‌ డెలివరీలు | - | Sakshi
Sakshi News home page

● సిజేరియన్లకే మొగ్గు చూపుతున్న యాజమాన్యాలు, డాక్టర్లు ● ప్రభుత్వం చెబుతున్నా సాధారణ ప్రసవాలకు ‘నో’ ● ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నార్మల్‌ డెలివరీలు

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

● సిజేరియన్లకే మొగ్గు చూపుతున్న యాజమాన్యాలు, డాక్టర్లు ● ప్రభుత్వం చెబుతున్నా సాధారణ ప్రసవాలకు ‘నో’ ● ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నార్మల్‌ డెలివరీలు

మంచిర్యాల మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వార్డులో బాలింతలు

మంచిర్యాలటౌన్‌: సాధారణ ప్రసవాలు మాత్రమే చేయాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారు. సాధారణ ప్రసవాలు అంటే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం అనే భావన కల్పించేలా ఆరేళ్లుగా జిల్లాలో జరిగిన ప్రసవాల గణాంకాలను చూస్తే అర్థం అవుతోంది. ప్రభుత్వం సాధారణ ప్రసవాలను మాత్రమే చేయాలని, సిజేరియన్‌ ప్రసవాలను చేపట్టవద్దన్న ఆదేశాలను ప్రైవే టు ఆస్పత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా, ప్రసవాలు అత్యధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైరిస్క్‌ కేసులకు మాత్రమే సిజేరియన్ల ద్వారా ప్రసవాలు చేస్తుండగా, ప్రైవేటులో మాత్రం సిజేరియన్ల ద్వారా ప్రసవాలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రసవం చేయలేనివి, హైరిస్క్‌ ఉన్న గర్భిణులను మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి రెఫర్‌ చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో చేసే సిజేరియన్‌లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నా, హైరిస్క్‌ కేసులతో సిజేరియన్‌ ప్రసవాలు కూడా జరుగుతున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కొందరు గర్భిణులు తమకు సాధారణ ప్రసవం వద్దని, పురిటి నొప్పులను భరించలేమని చెబుతుండగా, మరికొందరు మంచి రోజులు చూసుకుని, వారు చెప్పిన తేదీ, సమయానికి సిజేరియన్‌ చేయాలని కోరుతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరున్నరేళ్లలో సాధారణ ప్రసవాలు పది శాతంలోపే (9.22 శాతం) జరిగాయి. అంతేకాకుండా సాధారణ ప్రసవాల కంటే, సిజేరియన్‌ చేయడం వల్ల ఎక్కువ ఫీజు వస్తుండడంతో వైద్యులు ఆపరేషన్‌ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

సమీక్షలతోనే సరిపెడుతున్నారా?

ప్రసవాల్లో కడుపు కోతలను తగ్గించి, సాధారణ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వడం బాలింతలకు ఆరోగ్యకరమని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే పాటించాలని, తమకేం సంబంధం లేదన్నట్లుగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అవసరం ఉన్నా, లేకపోయినా సిజేరియన్‌ ద్వారానే ప్రసవాలు చేస్తుండడంతో, 10 శాతం లోపు మాత్రమే సాధారణ ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నా కనీస చర్యలు లేవు. మూడేళ్లుగా ప్రభుత్వం సాధారణ ప్రసవాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. నిత్యం ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. వారికి తగిన సూచనలు ఇస్తూనే సాధారణ ప్రసవాలు పెంచని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిజేరియన్‌లు ఎక్కువగా జరుగుతున్న ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోకపోవడం వల్లే సాధారణ ప్రసవాలు చేసేందుకు ముందుకు రావడంలేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement