శ్రీరాంపూర్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్‌లోని ఆ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి పర్యటనలు చేయడంతో సంస్థకు ఒరిగేదేం లేదని, ప్రస్తుత పరిస్థితిలో కంపెనీకి రావాల్సిన రూ.53వేల కోట్లను వెంటనే చెల్లిస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. కొత్త గనుల అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రతీనెల మెడికల్ బోర్డు నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యం చేస్తున్నారన్నారు. ఇటీవల మెడికల్ బోర్డు నిర్వహించినా అందులో అర్హులకు న్యాయం జరగలేదన్నారు. సింగరేణిలో కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను అధికారుల చేతనే ఇప్పించాలని ప్రజాప్రతినిధుల జోక్యాన్ని రూపుమాపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు నరెడ్ల వెంకటరెడ్డి, పెరిక సదానందం, తదితరులు పాల్గొన్నారు.


