కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా శనివారం సీబీఎస్‌ఈ క్లస్టర్–7 బాల,బాలికల కబడ్డీ టోర్నమెంట్–2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 160 జట్లు సుమారు 1,400 మంది క్రీడాకారులు విద్యార్థులు (700 మంది బాలురు, 700 మంది బాలికలు) పాల్గొంటున్నారు. సీబీఎస్‌ఈ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ–రీజినల్ ఆఫీసర్ జంగం సునీల్కుమార్‌తో కలిసి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారని, కబడ్డీ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప క్రీడ అని తెలిపారు. విజేత, రన్నరప్ జట్లను ప్రోత్సహించేందుకు రూ.లక్ష నగదు పారితోషికం అందజేస్తానని ప్రకటించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డా. చెన్నాడి అమిత్ కుమార్, ఉపాధ్యక్షుడు చి. సంపత్రావు, కార్యదర్శి బి. మల్లేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు, మానేరు స్కూల్ చైర్మన్ కె.అనంత రెడ్డి, కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, గుమ్మడి రాజకుమార్, గండ్ర లక్ష్మణ్ రావు, వివేకానంద స్కూల్ అకాడెమిక్స్ డైరెక్టర్ డా. టి.లలితా కుమారి, ప్రిన్సిపాల్ డా.ఆర్. రితీష్, ఉపాధ్యాయులు, కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో ఖోఖో పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న సీబీఎస్‌ఈ క్లస్టర్–7 ఖోఖో పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన పోటీలను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. పలు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఖోఖో సంఘం భాద్యులు వంగపల్లి సూర్యప్రకాశ్, రవీందర్, మోయినోద్దీన్, క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు పోటీలు..
సీబీఎస్‌ఈ క్లస్టర్– 7 బాల, బాలికల కబడ్డీ టో ర్నమెంట్–2026 మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ టోర్నమెంట్లో తె లంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీ బీఎస్‌ఈ పాఠశాలల నుంచి 160 జట్లు, సుమారు 1400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.


