ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ టైగర్‌జోన్ చెలుకగూడ అటవీప్రాతంలో శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య మొక్కలు నాటారు. టైగర్‌జోన్ అటవీశాఖ ఆధ్వర్యంలో 10 హెక్టార్లలో 12వేల మొక్కలు నాటారు. గతంలో ముల్తానీలు సాగు చేస్తున్న భూములను అటవీశాఖ భూములుగా గుర్తించి ఆ శాఖ ఆధ్వర్యంలో మూడేళ్లుగా అందులో మొక్కలు నాటుతున్నారు. అయితే గతేడాది జూలైలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులను అక్కడి ముల్తానీలు అడ్డుకొని పోలీసు వాహనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసారి పోలీసు బందోబస్తు మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బీర్సాయిపేట్, ఉట్నూర్, నేరడిగొండ రేంజ్ అధికారులు 80 మందితోపాటు 50 మంది బేస్‌క్యాంప్ సిబ్బంది, 180 మంది పోలీసులు పాల్గొన్నారు. మొక్కలు నాటే ప్రాంతాన్ని ఎస్పీ అఖిల్‌మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి, ఉట్నూర్ టైగర్‌జోన్ ఎఫ్‌డీవో అరవింద్ సందర్శించారు.


