మంచిర్యాలటౌన్: మంచిర్యాల– హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారిపై అధిక ట్రాఫిక్ వల్ల నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, మంచిర్యాల–కరీంనగర్–హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. నాగ్‌పూర్–హైదరాబాద్ నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మంచిర్యాల మీదుగా నిర్మాణం చేపడితే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతం ఐదు గంటలు పడుతుండగా, మూడు గంటల్లోనే హైదరాబాద్‌కు చేరుకోవచ్చని తెలిపారు. మంచిర్యాల నుంచి నిత్యం వేలాది వాహనదారులు విద్య, వైద్యం, వివిధ రకాల పనుల నిమిత్తం కరీంనగర్, హైదరాబాద్ వెళ్తుంటారని, వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జాతీయ రహదారి మంజూరు చేయాలని కోరారు.


