కాసిపేట: మండలంలోని దేవాపూర్ పోలీ స్‌స్టేషన్ పరిధిలోని దేవాపూర్ బుచ్చన్నవాడకు చెందిన గాజు ల రమేశ్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారాం శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కూలీ పని చేసుకునే రమేశ్ ఈనెల 22న ఉదయం 9గంటలకు లచ్చిరెడ్డి గూడెంలో మిషన్ పని ఉందని ఇంట్లో భార్యతో చెప్పి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కాగజ్‌నగర్‌లోని రమేశ్ తల్లిదండ్రులకు, తెలిసిన ఇతరులకు ఫోన్ చేసినా ఆచూకీ దొరకలేదు. దీంతో భార్య గాజుల కల్యాణి ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి గ్రే కలర్ షర్ట్, తెలుపు కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


