బిల్ –1 ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఆస్తి, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజు ఒకేసారి కట్టే అవకాశం కార్పొరేషన్, 11 మున్సిపాలిటీల్లో అమలుకు సన్నాహాలు
భైంసా: రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏకీకృత పన్ను విధానానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో పన్నుల చెల్లింపు సులభతరం చేసేందుకు బిల్ –1 ప్రక్రియ ప్రారంభించింది. ఇటీవలే హైదరాబాద్‌లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి ఈ సేవలను ప్రారంభించారు. త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లో ఈ విధానం అమలులోకి తీసుకురానున్నారు. ఆస్తి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజులు కలిపి ఒకేసారి చెల్లించే వీలు కలగనుంది.
ఒకే కౌంటర్‌పై..
బిల్ –1 ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు వేర్వేరు కౌంటర్లలో, వేర్వేరు విభాగాల్లో పొందాల్సిన సేవలను ఒకే వేదికపై అందించే అవకాశం కలగనుంది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే చోట దరఖాస్తులు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, ధ్రువపత్రాలు పొందడం వంటి సేవలను వేగంగా పూర్తి చేసుకునే వీలుంటుంది. దీంతో సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు అవినీతి, జాప్యాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఒకే పోర్టల్‌లో అన్ని బిల్లులు..
మున్సిపల్ శాఖ వెబ్‌సైట్‌లో బిల్ –1 ఆప్షన్‌ను క్లిక్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్)ను, అసిస్‌మెంట్‌కు రిజిస్టర్ అయిన సెల్‌ఫోన్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయగానే సంబంధిత ఆస్తిపై ఉన్న ఇంటి పన్ను, నల్లా పన్ను, ఆస్తిని వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తే అందుకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సు ఫీజు ఎంత మేర చెల్లించాలో బకాయిలతో సహా చూపిస్తుంది. ఈవిధానంతో బిల్లుల వసూలుకు మున్సిపల్ సిబ్బంది మూడుసార్లు తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంటి యజమాని సైతం మూడు సార్లు చెల్లించాల్సిన పని ఉండదు. ఒకేసారి అన్ని బిల్లులు చెల్లించవచ్చు.
ఉమ్మడి జిల్లాలో..
పన్నులు చెల్లిస్తున్న ప్రజలు (ఫైల్)
ఉమ్మడి జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో కూడా త్వరలో బిల్ –1 సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తయిన వెంటనే ప్రజలకు ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్‌పల్లి, నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం ఒక కార్పొరేషన్, 11 మున్సిపాలిటీల్లో ఈ సేవలను అమలు చేసేందుకు పురపాలక శాఖ చర్యలు చేపడుతోంది. అవసరమైన కంప్యూటర్ వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్ ఏర్పాటు, డేటా సమీకరణ, టిమ్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, సిబ్బందికి శిక్షణ వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని లక్షలాది పట్టణ ప్రజలు ఆధునిక, వేగవంతమైన పురపాలక సేవలను సులభంగా పొందే అవకాశం కలగనుంది.


