ఆదిలాబాద్‌టౌన్: ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వన్‌టౌన్‌లో వివరాలు వెల్లడించారు. ఈనెల 22న భుక్తాపూర్‌లోని శివం ఫ్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి దుకాణ యజమాని నుంచి స్కూటీ తీసుకుని పరారయ్యాడు. అదే సమయంలో తనతో వచ్చిన ఆటో డ్రైవర్‌ను కూడా నమ్మించి అతని మొబైల్ ఫోన్‌ను అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీతో నిందితులను గుర్తించారు. ఎన్‌టీఆర్ చౌక్ వద్ద వాహన తనిఖీల్లో హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ప్రధాన నిందితుడు అంతరం రమేశ్, కూకట్‌పల్లికి చెందిన ముంగి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు దొంగిలించిన మొబైల్‌ఫోన్లను కొనుగోలు చేసిన గుడిహత్నూర్‌కు చెందిన షేక్ అల్లావుద్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఇద్దరు నిందితులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు తేలింది. రమేశ్‌పై ఇది వరకే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నాయి. కాగా దొంగిలించిన మొబైల్ ఫోన్లలోని ఫోన్‌పేల ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 48 గంటల్లో ఛేదించిన ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, పోలీసు సిబ్బంది నరేశ్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించినట్లు పేర్కొన్నారు.


