చెన్నూర్: ిహిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశికి అత్యంత ప్రముఖ్యత ఉంది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నుంచే కొత్త తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సర కాలం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి చొప్పున వస్తాయి. శనివారం తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్ల పక్షం నుంచి కార్తీక శుక్ల పక్షం వరకు చాతుర్మాస్య దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ద ఏకాదశి రోజున మహావిష్ణు మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని హిందువులు పవిత్ర నెలలుగా భావించి చాతుర్మాస్య దీక్షలు చేస్తారు.
పండుగలు ప్రారంభం..
తొలి ఏకాదశి నుంచే తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి. ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతాలు ఆచరిస్తారు. శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీహరిని పూజిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి.
– దామెర మోహనాచార్యులు,
అర్చకులు, జగన్నాథాలయం, చెన్నూర్
ఆలయాల్లో పూజలు..
తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు సూర్యోదయానికి ముందే గోదావరిలో స్నానాలు ఆచరించి మహావిష్ణువు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. చాతుర్మాసం ప్రారంభం కానుండడంతో శ్రీ మహావిష్ణువు ఆలయాలు కిటకిటలాడుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మరునాడు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్ష విరమిస్తారు.


