భైంసాటౌన్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన మినీ గార్డెన్‌ను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. దీంతో విష యం తెలుసుకున్న ఎంఐఎం కౌన్సిలర్లు సాయంత్రం అక్కడకు చేరుకుని కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. వాస్తు పేరిట ఎలాంటి అనుమతులు లేకుండా పాలకవర్గ సభ్యులు ఇష్టారీతిన కార్యాలయ ఆస్తులు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఆవరణలోని మినీ గార్డెన్ కూల్చివేయడంతోపాటు అద్దె దుకాణాలను ఖాళీ చే యించి, వాటిని సైతం కూల్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలోనే బైఠాయించి నిరసన తెలిపారు. మినీ గార్డెన్ కూల్చివేత విషయమై చైర్మన్ తూముల దత్తాత్రిని వివరణ కోరగా, కార్యాలయ ఆవరణలో మినీ గార్డెన్ కారణంగా చెత్త సేకరణ వాహనాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల వాహనాలతోపాటు, కార్యాలయానికి వచ్చే ప్రజలు వాహనాలు నిలిపేందుకు సమస్య తలెత్తుతోందన్నారు. ఈ కారణంగానే మినీ గార్డెన్ కూల్చివేసినట్లు తెలిపారు. వాస్తు పేరిట ఎలాంటి ఆస్తినష్టం కలిగించే చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.


