నిర్మల్‌టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును గుర్తించడంతో పాటు తిరిగి అప్పగించి డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తుండగా జగిత్యాల జిల్లా కలికోట గ్రామానికి చెందిన దూలం గంగాధర్ జగిత్యాలలో బస్సు ఎక్కి విజయవాడలో దిగారు. ఈ క్రమంలో నిద్రలో ఆయన మెడలోని సుమారు 10 గ్రాముల బంగారు గొలుసు జారిపడిపోయింది. బస్సు ఒంగోలు చేరుకున్న తర్వాత డ్రైవర్లు జి. రమేశ్, పెంబి జమీల్‌లు తనిఖీ చేయగా బస్సులో ప్రయాణికుడు పడుకున్న బెర్త్ సీటులో బంగారు గొలుసు కనిపించింది. వెంటనే రిజర్వేషన్ సమయంలో నమోదైన ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికుడిని సంప్రదించారు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం విజయవాడ బస్టాండ్‌లో స్టేషన్ మేనేజర్ ఆధ్వర్యంలో బంగారు గొలుసును బాధితుడికి అప్పగించారు. ప్రయాణికుడి విలువైన వస్తువును భద్రంగా తిరిగి అప్పగించిన డ్రైవర్‌లను నిర్మల్ డిపో మేనేజర్ కే. పండరి అభినందించారు.


