బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 23మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం బాలికలు బగారా రైస్, ఆలుగడ్డ కూర, సాయంత్రం సోరకాయ కూరతో భోజనం చేశారు. రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, కొందరు కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. 10గంటల ప్రాంతంలో 15మంది బాలికలను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించారు. వీరిలో 13మంది గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగా, మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మరో ఎనిమిది మంది బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచారు. సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీఎంహెచ్‌వో నరేందర్‌రాథోడ్ వేర్వేరుగా ఆస్పత్రికి వచ్చి బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్‌ను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఆహారంలో పురుగులు..!
గత కొద్ది రోజులుగా భోజనం నాణ్యతగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రుచి, శుచి లేకుండా వడిస్తున్నట్లు తెలుస్తోంది. భోజనం నాణ్యత లేదని, పురుగులు, రాళ్లు వచ్చాయని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఫుడ్ ఫాయిజన్ జరిగినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆహారంలో నాణ్యత లోపించిందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు.


