ఇంద్రవెల్లి: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం ఎస్సై వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలం లాల్‌టెకిడి గ్రామానికి చెందిన జాదవ్ సురేందర్ విదేశాల్లో వెళ్లి ఉద్యోగం కోసం జగిత్యాల జిల్లా వాల్గొండకు చెందిన ఏజెంట్ శ్రీనివాస్‌గౌడ్‌ను సంప్రదించాడు. రూ.4.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పి అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ ప్రభాకర్‌ను పరిచయం చేశాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని సురేందర్‌ను నమ్మించారు. గతేడాది జూన్ 11 నుంచి విడతల వారీగా ఇద్దరికి ఫోన్ పే ద్వారా రూ.4,31,800 వేలు పంపించాడు. వేర్వేరు కారణాలు చెప్పడంతో మళ్లీ ఫోన్ పే ద్వారా రూ.2.20 లక్షలతో మొత్తం రూ.6,51,800లు చెల్లించాడు. డబ్బులు తీసుకుని విదేశాలకు పంపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని జాదవ్ సురేందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏజెంట్ శ్రీనివాస్‌గౌడ్, ఇస్లావత్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు. ఉట్నూర్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.


