మంచిర్యాలటౌన్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిన రాహుల్‌గాంధీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ప్రశ్నించారు. ప్రధాని ఇంటి ముందు ధర్నాకు నిరసనగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ చిత్రపటాన్ని దహనం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం పిరికిపంద చర్యని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానిని విమర్శించడంతో ఎంపీకి రాజకీయ పరిణతి లేదన్న విషయం తేటతెల్లమైందని తెలిపారు. గతంలో బీజేపీలో ఐదేళ్లు ఉన్నప్పుడు మోదీ విధ్వంసం కనిపించలేదా అని ప్రశ్నించారు. పార్టీ మండల అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, పట్టి వెంకటకృష్ణ, పచ్చ స్వప్నరాణి, మోతె సుజాత, ప్రేమ్‌సింగ్, పానుగంటి మధు, వైద్య శ్రీధర్ పాల్గొన్నారు.


