బెల్లంపల్లి: రైల్వేలో పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రెటరీ జి.సాంబశివుడు, చైర్మన్ ఎస్.నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో రన్నింగ్‌స్టాఫ్, ఇతర విభాగాల రైల్వే కార్మికులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే రన్నింగ్ స్టాఫ్ శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కనీసం 120 కిలోమీటర్ మైలేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సైన్ ఆన్ టు సైన్ ఆఫ్ చేసిన వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే కోశాధికారి షోకిన్ మీనా, అసిస్టెంట్ సెక్రెటరీ వివేక్‌కుమార్, కమిటీ సభ్యుడు లకలాల్ మీనా, లోకో పైలెట్లు, సంఘ సభ్యులు, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.


