మంచిర్యాలటౌన్: నీట్ పేపర్ లీకేజీ విషయంలో చేపట్టిన ధర్నాలో విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, ప్రశ్నించిన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలను అరెస్టు చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. రాహుల్, ప్రియాంకగాంధీల అరెస్టును నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ విద్యార్థులు ఢిల్లీలో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో లాఠీచార్జి చేయడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


