భీమారం: మంచిర్యాల అటవీ డివిజన్ పరిధిలోని భీమారం రిజర్వు ఫారెస్ట్‌లో బుధవారం తెల్లవారుజామున చుక్కల దుప్పిని వీధికుక్కలు వెంబడించడంతో పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్‌లో దూరింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు వల సాయంతో పట్టుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీలో తీసుకెళ్లి టేకు ప్లాంటేషన్‌లో వదిలేశారు. కార్యక్రమంలో ఎఫ్‌బీవోలు శ్రీకాంత్, బానేష్, వాచర్లు పాల్గొన్నారు.
వీధికుక్కలతో ముప్పు?
భీమారం రిజర్వుఫారెస్ట్‌లో జీవిస్తున్న కొండెగొర్రెలతో పాటు దుప్పులకు వీధికుక్కలతో ముప్పు పొంచి ఉంది. గ్రామానికి 100 మీటర్ల దూరంలో రిజర్వు ఫారెస్ట్ ఉండడంతో వీధికుక్కలు అడవిలోకి వెళ్లి వాటిపై దాడి చేస్తున్నాయి. నెలరోజుల క్రితం కొండగొర్రెను హతమార్చాయి. వీధి కుక్కల నుంచి వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.


