అక్కెపల్లికి వెళ్లే దారిలో లోలెవల్ కాజ్‌వేపై నుండి ప్రవహిస్తున్న వాగు నీరు
మంచిర్యాలఅగ్రికల్చర్/బెల్లంపల్లి/చెన్నూర్‌రూరల్/భీమారం/భీమిని: జిల్లాలో వానాకాలం ప్రారంభం నుంచి భారీ వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు భారీ ఊరట లభించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు వాన దంచికొట్టింది. 58.4మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎండిపోతున్న పంటలకు ఊపిరి పోసినట్లయింది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఎండాకాలం స్థాయికి చేరుతుండడంతో పత్తి మొలక వడలిపోతున్న సమయంలో ఈ వర్షం ఎంతో మేలు చేసింది. ఇన్ని రోజులు బోసిపోయిన వాగులు, ఒర్రెలు వరద నీటితో జలకళ సంతరించుకున్నాయి. చెరువులు, కుంటల్లోకి కొత్త నీరు చేరింది. జూన్ నెల ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి మంగళవారం నమోదైన వర్షపాతమే అధికం కావడం గమనార్హం. ఉక్కపోత నుంచి సాధారణ ప్రజలు కొంత ఊరట చెందారు. అయినా భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూడక తప్పడం లేదు. ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 371.4 మిల్లీమీటర్లు కాగా 281.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా 24శాతం లోటు నెలకొంది. ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 12 మండలాల్లో 20 నుంచి 40శాతం లోటు, దండేపల్లి మండలంలో అత్యధికంగా 70శాతం లోటు వర్షపాతం నెలకొంది.
రోజంతా ముసురు..
మంగళవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ బురద, చిత్తడిగా మా రాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు కురువాలని రైతులు గ్రామదేవతలకు పూజలు, మొక్కులు చెల్లిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి పవర్‌సిటీ, రంగంపేట, పాత మంచిర్యాల వెళ్లే కాజ్‌వే వంతెన తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కాజ్‌వే వంతెన వద్ద వరద నీటిలో చేపలు పట్టేందుకు స్థానికులు పోటీ పడ్డారు. వలకు మార్పు, జెల్ల, బొచ్చ తదితర చేపలు చిక్కాయి.


