ఆధ్యాత్మికం.. అగస్త్య గుండం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం.. అగస్త్య గుండం

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

అగస్త్యుడు నడియాడినట్లు చెబుతున్న పురాణాలు ఆదరణకు నోచుకోని ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌

సోషల్‌ మీడియాలో..

చెన్నూర్‌: అగస్త్య మహాముని చెన్నూర్‌ ప్రాంతంలో నడియాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. చెన్నూర్‌ మండలంలోని రాయిపేట గోదావరి తీరంలో గల కోటి లింగాలను దర్శించుకున్న అగస్త్యుడు కాలినడకన కత్తరశాల మీదుగా చెన్నూర్‌ పెద్ద చెరువుకు చేరుకొని గుండంలో స్నానం ఆచరించి అక్కడే ఉన్న శివాలయంలో పూజలు చేశారని పెద్దలు కథలు కథలుగా చెబుతుంటారు. ఈక్రమంలోనే పెద్ద చెరువుకు అగస్త్య గుండంగా పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది.

సొంత ఖర్చుతో..

అగస్త్య మహాముని ఆనవాళ్లు కనుమరుగు కాకుండా ఉండాలని 2006లో మాజీ ఎంపీపీ స్వర్గీయ మైదం సత్యనారాయణ తన సొంత ఖర్చులతో చెన్నూర్‌ పెద్ద చెరువు కట్ట నుంచి చెరువు మధ్య భాగం వరకు వంతెన నిర్మించారు. గుండం నిర్మాణంతో పాటు అతిపెద్ద శివలింగం నిర్మాణానికి పూనుకున్నారు. అగస్త్య గుండంతో పాటు శివలింగాన్ని సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆయన చిరకాల వాంఛ తీరకముందే కన్నుముశారు. ఆయన మృతితో అగస్త్య గుండం ఆదరణకు నోచుకోలేదు. 20 ఏళ్ల నుంచి అగస్త్య గుండాన్ని పట్టించుకున్న నాధుడే లేరని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.

గోదావరి పుష్కరాల నాటికి..

2027లో చెన్నూర్‌ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల నాటికి చెన్నూర్‌ అగస్త్య గుండాన్ని అభివృద్ధి చేస్తే జిల్లాలోనే గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా మారుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. పెద్ద చెరువు కట్ట నుంచి శివలింగం వరకు నిర్మించిన వంతెనకు ఇరువైపులా గోడ నిర్మించి, గుండం చుట్టూ రక్షణగా స్టీలు పైపులు ఏర్పాటు చేసి శిథిలావస్థకు చేరుకున్న శివలింగం, ప్రహరీ పునఃనిర్మించి రంగులు వేయాలని పర్యాటకులు కోరుతున్నారు. పెద్ద చెరువులో ఏప్రిల్‌ వరకు పూర్తి స్థాయిలో నీరు ఉంటుందని బోటింగ్‌ ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి కూడా ఆదాయం సమకూరుతుందంటున్నారు.

చెన్నూర్‌లో సుమారు 400 ఏళ్ల ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే శివాలయం, జగన్నాథాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అసంపూర్తిగా ఉన్న అగస్త్య గుండాన్ని సందర్శించి ఫొటోలు దిగి నిరాశగా వెళ్తున్నారు. అయితే చెన్నూర్‌లో అందమైన ఆధ్యాత్మిక అగస్త్య గుండం ఉందని గత వారం రోజులుగా సోషల్‌ మీడియా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాంలలో వైరల్‌గా మారింది. దీంతో కాళేశ్వరంలో జరిగే సరస్వతీ పుష్కరాలకు వచ్చిన భక్తులు అగస్త్య గుండాన్ని సందర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement