ఆదిలాబాద్‌టౌన్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వరుస చోరీలకు పాల్ప డుతున్న ముగ్గురు నిందితులను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.46లక్షల 46వేల 600 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 23న ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ కేసును సవాల్‌గా తీసుకుని సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులు మహారాష్ట్రలో దొంగిలించిన స్విఫ్ట్ డిజైర్ కారుకు ఫేక్ నంబర్ ప్లేట్లు అమర్చి, నకిలీ ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తూ పోలీసులను తప్పుదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఆదిలాబాద్‌లో చోరీ అనంతరం నిందితులు కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ వరుస చోరీలకు పాల్ప డ్డారు. బుధవారం ఉదయం సీసీఐ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు వీరిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుల్లో ఈస్ట్ ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన జైచంద్, మహారాష్ట్రలోని నాగపూర్ భరత్‌వాడా పాండికి చెందిన ప్రేమ్ షాలిక్‌రామ్ ఖత్రి, ఇదే రాష్ట్రంలోని నాగపూర్ భిల్‌గావ్‌కు చెందిన సతేంద్ర గుప్తా ఉన్నారు. వీరి నుంచి 33 తులాల బంగారు, 71 తులాల వెండి ఆభరణాలు, స్విఫ్ట్ డిజైర్ కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 15,200 నగదు, ఇనుప రాడ్లు, డ్రిల్లింగ్ రాడ్, కట్టింగ్ ప్లేయర్, ఫేక్ నంబర్ ప్లేట్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో హత్య, హ త్యాయత్నం, రాబరీ, చైన్‌స్నాచింగ్ తదితర తీవ్రమైన కేసుల్లో పాల్గొన్నారు. పలుసార్లు జైలు శిక్ష కూ డా అనుభవించారు. ఈ కేసును ఛేదించి చోరీ సొత్తు రికవరీ చేయడంలో కీలకపాత్ర పోషించిన వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సైలు అశోక్, సంజయ్, రమేశ్, హనుమంతు, శ్రీను, జాకీర్, ఆర్‌ఎస్సై గో పి, కానిస్టేబుల్ త్రిశూల్ తదితరులను ఎస్పీ అభినందించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి.సునీల్‌కుమార్, ఆర్‌ఎస్సై గోపి, ఎస్సైలు అశోక్, సంజయ్ తదితరులున్నారు.


