కానిస్టేబుల్ ఆత్మహత్య
మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటపల్లెకు చెందిన అరవింద్ యాదవ్ (31) అనే కానిస్టేబుల్ శనివారం రాత్రి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే అరవింద్ యాదవ్ 2026 మార్చి 6న ఽవిధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి సొంతూరు ఎర్రగుంటపల్లెలోనే తల్లి, చెల్లితో కలిసి ఉంటున్నాడు. సస్పెండ్ కావడంతో మానసిక వేధనకు గురై శనివారం రాత్రి 11 గంటలకు రామన్ కాలనీ సమీపంలోని ఏడు కానాల బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్‌పై హిమసాగర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
వివాహిత ..
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చిచ్‌ధరి ఖానాపూర్‌కు చెందిన కమలాబాయి (55) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విష్ణువర్ధన్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాబాయి జీవితంపై విరక్తి చెంది అఘాయిత్యానికి పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఇచ్చోడ: మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గాంధీనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ గ్రామానికి చెందిన తయ్యూబ్ (45) తన భార్యతో కలిసి ఆదిలాబాద్ నుంచి తన స్వగ్రామం మాదాపూర్‌కు బైక్‌పై వెళ్తుండగా గాంధీనగర్ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తయ్యూబ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలపాలైన భార్యను స్థానికులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
సుంకిడిలో పశువు చోరీ
తలమడుగు: పశువుకు మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన గుమ్మడి ఆశన్నకు చెందిన ఆవుకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. మరో నాలుగు పశువులకు మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి ఆటో ట్రాలీలో ఎక్కించే సమయంలో సమీపంలో ఉన్న ఇళ్లలోని వ్యక్తులు గమనించడంతో అక్కడ నుంచి పరారయ్యారు. మత్తుమందు ఇంజక్షన్ ఇవ్వడంతో నాలుగు పశువులు స్పృహ కోల్పోయి ఉన్నాయి. గ్రామంలో పశువుల దొంగతనం జరగడం ఇది మూడోసారి. బాధితుడు ఆశన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.
ఇంట్లో దొంగతనం
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కు చెందిన పెంచాల పద్మ ఇంట్లో దొంగతనం జరి గినట్లు స్థానిక సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ ఈ నెల 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువా పగులగొట్టి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దొంగలు 10 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు దోచుకెళ్లారు. బాధితురాలు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


