దండేపల్లి/జన్నారం/లక్సెట్టిపేట: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులు, గోదాంలకు తరలించడంలో ఆలస్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన దండేపల్లి, లింగాపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, గోదాములు సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ లారీల కొరత ఉన్నచోట రైతులు ట్రాక్టర్, ఇతర గూడ్స్ వాహనాలు సమకూర్చుకుని మిల్లులు, గోదాంలకు ధాన్యం బస్తాలు తరలించుకుంటే కిరాయి డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామ కొనుగోలు కేంద్రం నంబరు–3 నుంచి తాలు తప్ప రావడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దండేపల్లి తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, జన్నారం తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్‌షరీఫ్, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
డెంగీ వ్యాధి నివారణకు కృషి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో డెంగీ వ్యాధి నివారణకు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ నెల 16న జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.అనిత, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, అధికారులతో కలిసి డెంగీ నివారణపై గోడప్రతులు, కరపత్రాలు ఆవిష్కరించారు.
ఓటరు సవరణకు కంట్రోల్ రూమ్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అందుబాటులో ఉంటుందని, సందేహాలు, సమాచారం కోసం 08736–250501 నంబరులో సంప్రదించాలని తెలిపారు.


