మంచిర్యాలక్రైం: గోరక్షక్ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడినా, వాహనాలు ధ్వంసం చేసినా సహించబోమని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎం కన్వెన్షన్ హాల్‌లో గోరక్షక్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏడు శాశ్వత చెక్‌పోస్టులు, 15తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఒక పశువైద్యాధికారి, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే డయల్ 100, కమిషనరేట్ కంట్రోల్ రూం నంబరు 87126 56597కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్‌రావు, ఆకుల అశోక్, హనొక్, రమణమూర్తి, రవీందర్, ఎస్సైలు పాల్గొన్నారు.


