మెడికల్ బోర్డు నిర్వహించకుంటే సమ్మె
నస్పూర్: యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు ఒక నెలలోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే సమ్మెకు వెళ్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. గురువారం ఆయన నాయకులతో కలిసి నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న హైదారాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రుతో జరిగిన సమావేశంలో కార్మికుల పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిందని తెలిపారు. సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్ రద్దుపై వచ్చే స్ట్రక్చర్ సమావేశంలో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్లకు నియామక పత్రాలను యాజమాన్యం త్వరలోనే అందజేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్, మందమర్రి బ్రాంచి సెక్రెటరీలు ఎస్‌కే బాజీసైదా, సలేంద్ర సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, ఆఫీస్ బేరర్ సుధాకర్ పాల్గొన్నారు.


