కోటపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం మండలంలోని దేవులవాడ గ్రామానికి చెందిన ఇందారపు భాగ్యలక్ష్మి ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందని, దీంతో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం సమ్మక్క, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం..
మందమర్రిరూరల్: సింగరేణిలో నూతన గనులు తీసుకురావడంతో కొత్తగా ఉద్యోగావకాశాలు వస్తాయని, సింగరేణికి పూర్వవైభవం వస్తుందని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం ఏరియాలోని కేకే–5 గని వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ ఉద్యోగులు సమష్టిగా నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. శ్రమశక్తి అవార్డు అందుకున్న పవన్‌కుమార్, పుల్లూరి లక్ష్మణ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం రాధాకృష్ణ, గని మేనేజర్ శంభూనాథ్‌పాండే, తహసీల్దార్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.


