చెన్నూర్: పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు అయిత హిమవంతరెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు హిమవంతరెడ్డి ఈ నెల 4న కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లాడు.ఈ నెల 13న రాత్రి ఇంటికి వచ్చి చూడగా ముందు వెనుక తలుపునకు వేసిన తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం చెన్నూర్ సీఐ బన్సీలాల్, మంచిర్యాల క్లూస్ టీం సీఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ నెల 5న రాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు దొంగలు గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరించి ప్రహరీ దూకి ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.


