ఇచ్చోడ: మండలంలోని దుబార్‌పేట్‌లో సలాం నాగోరావుకు చెందిన జొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సలాం నాగోరావు దుబార్‌పేట్ శివా రులో నాలుగెకరాల్లో జొన్నసాగు చేశాడు. ఇటీవలే పంటను కోసి నూర్పిడి చేసేందుకు చేనులోనే కుప్పగా వేశాడు. గురువారం మధ్యాహ్నం పక్క పొలాల్లోని రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో మంటలు వ్యాపించి నా గోరావు జొన్నకుప్పకు అంటుకున్నాయి. గమనించిన రైతులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించినా సిబ్బంది వచ్చేలోపే పంట కాలిబూడిదైంది. ఘటనలో దాదాపుగా రూ.3. 50 లక్షల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. ఆర్‌ఐ రేఖ, జీపీవో పురుషోత్తం సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు.


