ఖానాపూర్: సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రముఖ సామాజిక కార్యకర్త ఏదులపురం సత్యనారాయణచారి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ‘ది హిస్టారికల్ డివైన్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్– శ్రీ బదరికాశ్రమ’ అనే అంశంపై గ్లోబల్ బద్రినాథ్ కాన్‌క్లేవ్ జరుగనుంది. సదస్సుకు ఎంపికై న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన సత్యనారాయణచారి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారతీయ జ్ఞాన వ్యవస్థ (ఐఓ) ప్రాచీనత, ఆధునిక సమాజంలో దాని ప్రాముఖ్యతపై సదస్సులో విస్తృత చర్చలు జరుగనున్నాయి. భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి పండితులు, పరిశోధకులు, నిపుణులు హాజరై భారతీయ తాత్విక సంప్రదాయాలు, వేద విజ్ఞానం, ఆధ్యాత్మికత, శాసీ్త్రయ దృక్పథంపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఇండో–టిబెటన్ సరిహద్దు ప్రాంతంలోని సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ముఖ్యంగా ‘భారతదేశ చివరి గ్రామం’గా ప్రసిద్ధి చెందిన మానా గ్రామ ప్రాధాన్యంపై కూడా చర్చించనున్నారు. వ్యాస మహర్షి వేదాలను సంకలనం చేసిన పవిత్ర భూమిగా విశ్వసించే బద్రీనాథ్‌లో ఈ సదస్సు నిర్వహించడం విశేషంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ మేధో, సాంస్కృతిక ప్రతిభను చాటిచెబుతున్న సత్యనారాయణ చారిని పలువురు అభినందిస్తున్నారు.


