బాసర: మనస్తాపంతో గోదావరి నదిలో దూకేందుకు యత్నించిన ఓ మహిళను బాసర పోలీసులు సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బాసర మండలం లబ్ధి గ్రామానికి చెందిన నికిత షిండే అనే మహిళ ఇంట్లో గొడవల కారణంగా బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో బాసర గోదావరి నది వద్దకు చేరుకుంది. ఆమెను గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. బాసర పోలీస్ బృందం మెరుపు వేగంతో అక్కడికి చేరుకొని నదిలోకి దూకేందుకు సిద్ధమైన బాధితురాలిని చాకచక్యంగా అడ్డుకున్నారు. ఆమెకు నచ్చజెప్పి, ధైర్యం చెప్పి ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన బాసర పోలీస్ సిబ్బంది నరేంద్ర చారి, శ్రీకాంత్‌లను సీఐ కిరణ్, ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.


