అగ్గి రగిలితే.. బుగ్గే..! | - | Sakshi
Sakshi News home page

అగ్గి రగిలితే.. బుగ్గే..!

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

పలు ప్రాంతాలకు దూరంగా ఫైర్‌స్టేషన్లు ఫైర్‌ ఇంజన్‌ వచ్చేలోపే తీవ్ర నష్టం వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత ముందస్తు జాగ్రత్తలు అనివార్యం

మంచిర్యాలక్రైం: జిల్లాలో తరుచుగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రజలు వేసవిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే అగ్గి రగిలితే మిగిలేది బుగ్గేనని అధికారులు పేర్కొంటున్నారు. కాగా మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, జన్నారం మండల కేంద్రాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. అగ్ని మాపక కేంద్రాలకు చుట్టూ 20 –25 కిలోమీటర్ల దూరంలో గ్రామాలున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగితే సమాచారం అందిన తర్వాత అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైర్‌ ఇంజన్‌ ఘటన స్థలానికి చేరుకునే సరికి 30–50 నిమిషాల వరకు సమయం పడుతోంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

సిబ్బంది లేక ఇబ్బంది..

మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు, 382 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలీటీలు, ఒక నగర కార్పొరేషన్‌కు గాను నాలుగు ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. ఫైర్‌స్టేషన్‌లలో ఓ వైపు సిబ్బంది కొరత వెక్కిరిస్తుంటే, దీనికి తోడు జిల్లా కేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో రెండు ఫైర్‌ ఇంజన్లు ఉండగా మిగితా స్టేషన్లలో ఒక్కో ఫైర్‌ ఇంజన్‌ మాత్రమే ఉంది. దీంతో ఒకే సారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదా లు జరిగితే ఫైర్‌ ఇంజన్‌ ఒక్క చోటుకే పరిమితమై మరో ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ఒక్క ఫైర్‌ స్టేషనకు 16 మంది చొ ప్పున నాలుగు ఫైర్‌ స్టేషన్లకు 64 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 45 మంది మాత్రమే ఉన్నారు.

అగ్ని ప్రమాదాలకు కారణాలు..

పట్టణాల్లో జరిగే 70 శాతం అగ్ని ప్రమాదాలు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరుగుతున్నాయి. దీనికి కారణం నాసిరకం విద్యుత్‌ తీగలు వాడడమే. తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం తీగలతో ఓవర్‌ లోడ్‌ విద్యుత్‌ సరఫరా జరిగినప్పుడు విద్యుత్‌ ప్రమాదం జరుగుతోంది. తీగలు తెగినప్పుడు జాయింట్స్‌ వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల విద్యుత్‌ జాయింట్‌ వేసిన చోట ఓవర్‌ లోడ్‌ విద్యుత్‌ సరఫరా జరిగినప్పుడు వేడికి కరిగిపోయి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఏళ్ల తరబడి వాడుతున్న విద్యుత్‌ తీగల్లో లోటుపాట్లను గుర్తించి మార్చుకోవడం మంచిది. పట్టణ కేంద్రాల్లో కొందరు స్క్రాప్‌ దుకాణాలను ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేసుకొని దందా నడుపుతున్నారు. ఇందులో అట్టపెట్టెలు, ప్టాస్టిక్‌ డబ్బలు, న్యూస్‌పేపర్లు నిల్వ ఉంచుతుంటారు. అక్కడ అగ్నిప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

భీమిని మండలం పెద్దపేటకు చెందిన అరికెల విజయకు చెందిన ఇల్లు ఈ నెల 11న విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం భూమిని అమ్మగా వచ్చిన రూ.12 లక్షల నగదు, తులం బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, నిత్యావసర సామగ్రి దగ్ధమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement