ఒంటరి మహిళలే లక్ష్యం..! | - | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే లక్ష్యం..!

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

మ్యాట్రిమోని సైట్‌ ద్వారా పరిచయం పెళ్లి చేసుకుంటానని నమ్మించి బంగారం, నగదుతో పరారీ నిందితుడు అరెస్ట్‌ వివరాలు వెల్లడించిన మంచిర్యాలరూరల్‌ సీఐ రవీందర్‌

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మహిళలను నమ్మించి బంగారం, నగదు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌ తెలిపారు. బుధవారం కేసు వివరాలను పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన కాళహస్తి శిరీష్‌కుమార్‌ కారు డ్రైవర్‌. ఇతనికి మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన రాంపల్లి రజితతో మ్యాట్రిమోని ద్వారా పరిచయం ఏర్పడగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నెల 1వ తేదీన నగలు చేయిద్దామని రజితను తీసుకుని మంచిర్యాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుడిపేట శివారులో గల ఓ దాబా వద్ద బైక్‌ ఆపాడు. రజిత మెడలో ఉన్న బంగారు గొలుసు బరువు చూస్తానని చెప్పి తీసుకొని ఆమెను పక్కకు తోసేసి బైక్‌పై హైదరాబాద్‌కు పారిపోయాడు. దీంతో రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిరీష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా శిరీష్‌కుమార్‌ గతంలో ప్రకాశం జిల్లాలో మూడు ద్విచక్ర వాహనాల దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడని, మ్యాట్రిమోని సైట్‌ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఒంటరి మహిళను పెళ్లి చేసుకుని ఆమె నుంచి రూ.3 లక్షలు తీసుకుని పారిపోయిన కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడని సీఐ గోపతి రవీందర్‌ తెలిపారు. వివాహ సంబంధిత సైట్‌లలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వారు పూర్తిస్థాయిలో విచారించిన మీదటే పెళ్లికి అడుగులు వేయాలని పేర్కొన్నారు. కేసు విచారణ వేగవంతం చేసి నిందితుడిని పట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన హాజీపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు బి.తిరుపతి, జి.సత్యనారాయణ, జి.చంద్రశేఖర్‌, పి.రాజేందర్‌లను పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement