ధాన్యం సేకరణ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ వేగవంతం

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

● పుంజుకుంటున్న కొనుగోళ్లు ● తూకం వేశాక తరలింపునకు చర్యలు ● మిల్లులతో సహా ఏఎంసీ గోదాముల్లో నిల్వ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరిగింది. మంగళవారం 34వేల మెట్రిక్‌ టన్నుల సేకరణ జరుగగా, 26వేల మెట్రిక్‌ టన్నులు రవాణా జరిగింది. మొదట సరిపడా మిల్లులకు ట్యాగింగ్‌ లేక తూకం వేసిన ధాన్యం రవాణాలో జాప్యం చోటు చేసుకుంది. హమాలీల చార్జీలపై స్పష్టత లేక ధాన్యం నిలిచిపోయింది. ఓ వైపు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ట్యాగింగ్‌ ఇచ్చిన 12 మిల్లులకు తోడు ఏఎంసీ గోదాములు అందుబాటులోకి రావడంతో గత మూడు రోజులుగా ధాన్యం రవాణా క్రమంగా పెరుగుతోంది.

రంగంలోకి ఎమ్మెల్యే పీఎస్సార్‌

జిల్లాలో వరి సగానికి పైగా మంచిర్యాల నియోజకవర్గంలోనే సాగవుతోంది. ఇటీవల అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నివారించేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్‌) నేరుగా అందరితో మాట్లాడుతూ వడ్లు త్వరగా దించుకునేలా ఏర్పాట్లు చేశారు. హమాలీల కొరత తీరేలా బీహార్‌తోపాటు స్థానికులను వినియోగిస్తున్నారు. జిల్లా కార్మిక శాఖ అధికారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు, మిల్లర్లు, ఐకేపీ, రవాణా కాంట్రాక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జాప్యం జరుగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దండేపల్లి మండలంలో తడిసిపోయిన వడ్లను ఎమ్మెల్యే పీఎస్సార్‌ చొరవ తీసుకుని మిల్లర్లు తీసుకునేలా చేశారు. మొదట మిల్లర్లు తీసుకునేందుకు అయిష్టత చూపారు. దీంతో ఆయన చొరవ తీసుకుని బాయిల్డ్‌ మిల్లర్‌తో ఒప్పించి ఆ ధాన్యం తీసుకునేలా చేశారు.

కొనుగోలు కేంద్రాలు : 334

సేకరణ లక్ష్యం అంచనా : 2లక్షల

మెట్రిక్‌ టన్నులు

ధాన్యం సేకరణ : 34,700

మెట్రిక్‌ టన్నులు

రవాణా చేసింది : 26,300

మెట్రిక్‌ టన్నులు

నగదు చెల్లింపులు : రూ.6.48కోట్లు

రైతులు : 328మంది

Advertisement
 
Advertisement
Advertisement