నెన్నెల: మండలంలోని గొల్లపల్లిలో ఈ నెల 13న జరగనున్న బాల్య వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన ఓ బాలికకు ఆసిఫాబాద్ జిల్లా బూరుగూడకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు ఐసీడీఎస్ సీడీపీవో స్వరూపారాణి, సూపర్‌వైజర్ సుజాత, డీటీ వెంకటేశ్వర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సులోచన, చైల్డ్‌లైన్ సభ్యులు సౌజన్య పోలీసులతో కలిసి గ్రామానికి వెళ్లి బాలిక ఆధార్ కార్డు, భర్త్ సర్టిఫికేట్ , బోనోఫైడ్‌ను పరిశీలించారు. వయస్సు 15 ఏళ్లు ఉన్నట్లు తేలడంతో బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే జరిగే అనర్థాలు, చట్టాల గూర్చి వివరించారు. మైనర్లకు వివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి హాజరైన పెద్దలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 18 ఏళ్లు దాటే వరకు పెళ్లి చేయమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాయించి ఇవ్వడంతో అధికారులు వెళ్లిపోయారు.


