ధాన్యం నిల్వలకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం నిల్వలకు ఇబ్బందులు

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

2022–23 రబీ టెండర్‌ ధాన్యానికి ధర ఖరారు

90రోజుల్లో చెల్లిస్తే ఆ మిల్లులకు ట్యాగింగ్‌

ధాన్యమిస్తే గడువులోపు చెల్లిస్తామని విన్నపాలు

ఈ సీజన్‌లో మిల్లులు పెరిగితేనే సేకరణ సులువు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వం వేలం వేసిన ధాన్యం(టెండర్‌ ప్యాడీ) బాకీ పడిన మిల్లర్లకు ఊరట కలుగుతోంది. 2022–23 రబీ ధాన్యాన్ని టెండర్‌ వేసినా సకాలంలో తరలించలేదు. ఈ ధాన్యం తిరిగి ఇవ్వలేదని మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిచిపోయాయి. ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం ఆ ధాన్యానికి ఒక క్వింటాల్‌కు రూ.2236.81చొప్పున మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు చెల్లించాలని నిర్ణయించింది. ఒకవేళ మిల్లుల్లో ధాన్యం లేకపోతే మిస్సింగ్‌గా పరిగణిస్తూ, ఒక క్వింటాల్‌కు రూ.2441.90చొప్పున చెల్లించాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జీవో విడుదల కాగా, జిల్లాలో ఏడుగురు మిల్లర్లకు ఊరట లభించింది. ఇప్పటికే రూ.కోటిలోపు బాకీ ఉన్న ముగ్గురు మిల్లర్లు ఆ మేరకు మొత్తాన్ని చెల్లించారు. మరో నలుగురు మిల్లర్లు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన విలువ మేరకు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం 90రోజుల గడువు ఇవ్వడంతో ఈ మేరకు ధాన్యం ఇస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని చెబుతున్నారు.

మిల్లులు పెరిగితే మేలు

ఓ వైపు అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12మిల్లులకే అనుమతి ఇవ్వగా, వీటిలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం రవాణా కావడం లేదు. యాసంగి ధాన్యం నిల్వలకు ఇబ్బందితోపాటు దిగుబడికి తగినంత నిల్వ సామర్థ్యం లేవు. ఏటేటా ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ఈ సీజన్‌లో 2లక్షల మెట్రిక్‌ టన్నులకు పైనే వస్తుందనే అంచనా. జిల్లాలో మిల్లులు, గోదాం నిల్వలు పోను, మరో 60నుంచి 70మెట్రిక్‌ టన్నల ధాన్యానికి ఇబ్బందిగా మారింది. జిల్లా ధాన్యం 50వేల మెట్రిక్‌ టన్నులు పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల మిల్లులకు పంపేందుకు అనుమతి ఉంది. దీంతో ఇక్కడి మిల్లులకు పని లేక మూతపడుతున్నాయి. తమకు ధాన్యం కేటాయిస్తే నిబంధనల మేరకు పని చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు మిల్ల ర్లు విన్నవిస్తున్నారు.

జిల్లాలో మొత్తం రూ.108కోట్ల వరకు మిల్ల ర్లు ‘సీఎంఆర్‌’(కస్టం మిల్లింగ్‌ రైస్‌) బకాయిలు ఉండగా, ఇందులో టెండర్‌ ధాన్యం సంబంధించిన సుమారు రూ.20కోట్ల వరకు ఉంటాయి. మిగతావి సకాలంలో బియ్యం ఇవ్వని మిల్లులు ఉన్నాయి. 20పైగా మిల్లులపై ఆర్‌ఆర్‌(రెవెన్యూ రికవరీ) క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. బాకీ మొత్తాన్ని 25శాతం జరిమానా, 12శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ ఆ మిల్లులను బ్లాక్‌ లిస్టులో పెట్టారు. దీంతో జిల్లాలో సీఎంఆర్‌ మిల్లుల ట్యాగింగ్‌ తగ్గిపోయింది. కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తున్నారు. అప్పటికీ నిల్వలకు సరిపోక ట్యాగింగ్‌ ఇవ్వని మిల్లులకు సైతం ధాన్యం పంపి తాత్కాలికంగా నిల్వ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement