మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు గత ప్రభుత్వ హయాంలో 2023 మార్చి 17న లాటరీ ద్వారా 1600 మంది లబ్ధిదారుల్లో 330 మంది పేదలను ఎంపిక చేశామని, వారికే ఇవ్వాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. డ్రా తీసే సమయంలో లబ్ధిదారులు కాకుండా ఇతరులు ఎవరిని కూడా జిల్లా కలెక్టర్ లోనికి అనుమతించలేదని, తనతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ లక్కీడ్రాలో పాల్గొనలేదని తెలిపారు. రెండున్నరేళ్ల నుంచి ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మరోసారి లాటరీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయాలన్న ప్రతిపాదన చేయడం వల్ల గతంలో ఇళ్లను పొందిన లబ్ధిదారులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.


