2023–24 పీఏఐ నివేదికలో వెనుకబాటే..
ఓవరల్‌గా 77.42 స్కోరుతో లింగయ్యపల్లి టాప్
ఏ పంచాయతీకి దక్కని రాష్ట స్థాయి స్కోరు
గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనతోనే ప్రగతి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశ ప్రగతిలో పట్టుగొమ్మలైన పల్లెల్లో సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించే ‘పంచాయతీ అడ్వాన్స్‌మెంటు ఇండెక్స్(పీఏఐ) 2.0’లో జిల్లా పంచాయతీలు వెనుకబడ్డాయి. దేశంలో పంచాయతీ పరిస్థితిని సమగ్రంగా అధ్యయనం చేసి సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ప్రతీయేటా ఓ నివేదికను రూపొందిస్తారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపోజిట్ ఇండెక్స్(1.0) మొదలు కాగా, తర్వాత పల్లెల సమగ్ర ప్రగతిని అంచనా వేసేలా 2.0లో మరిన్ని అంశాలు జోడించారు. తాజాగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పంచాయతీల వారీగా సాధించిన స్కోరును విడుదల చేసింది. ఈ నివేదిక జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి తీరును వెల్లడించింది. ఈ జాబితాలో జిల్లా నుంచి పీఏఐ ఓవరాల్‌గా ఏ పంచాయతీ కూడా ఏ ప్లస్ స్కోరుతో చోటు దక్కించుకోలేకపోయింది. చెన్నూర్ మండలం పొన్నారం రాష్ట్రంలోనే చివరి పది స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ఇక రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో ఏ పంచాయతీ కూడా లేదు. జిల్లా పరిధిలో అత్యుత్తమంగా జన్నారం మండలం లింగయ్యపల్లి పంచాయతీ పీఏఐ ఓవరాల్‌గా 77.42 స్కోర్‌తో ఏ కేటగిరీలో ఉంది.
పరిస్థితిపై అంచనా
ప్రతీ పంచాయతీ నుంచి తొమ్మిది అంశాల్లో డేటా సేకరించారు. పేదరికం, వైద్యం, శిశు, మహిళా స్నేహ పూర్వక వాతావరణం, తాగునీరు, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన అంశాలను పరిగణనలోకి తీసుకుని సూచీలను ప్రకటించారు. జిల్లాలో 18 మండలాల్లోని 304 పంచాయతీలు ఉండగా వీటిలో 102 పంచాయతీల నుంచి అన్ని విభాగాల్లో డేటా తీసుకున్నారు. స్థానిక అధికారులు గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలను పాయింట్ల వారీగా డేటాను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేశారు. వీటిని మరోసారి ఆన్‌లైన్ డేటాతో సరిపోల్చుకుని కేంద్రం ప్రకటించింది. ఈ స్కోరులో ఏ ప్లస్ 90పైన, ఏ 75 నుంచి 90, బీ 60 నుంచి 75, సీ 40 నుంచి 60, డీ 0 నుంచి 40గా కేటగిరీలుగా ప్రకటించారు.


