అటు పరీక్షలు.. ఇటు మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

అటు పరీక్షలు.. ఇటు మూల్యాంకనం

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

● ‘పది’ ఫలితాలకు మార్గం సులువు ● గతేడాది కంటే ఒక రోజు ముందే వెల్లడి

మంచిర్యాలఅర్బన్‌: పదో తరగతి పరీక్షలు ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతంగా పూర్తి కావడంతో ఫలితాల వెల్లడికి మార్గం సులువైంది. గతంలో పరీక్షలు ముగిశాక మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కాగా ఈ ఏడాది పరీక్షల మధ్యలో మూడు విడతల్లో మూల్యాంకనం సాగింది. ఒకేసారి అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం వల్ల గందరగోళం నెలకొనగా.. ఈసారి సబ్జెక్టుల వారీగా టీచర్లకు అదే రోజు విధులు కేటాయించడం కూడా సాఫీగా సాగేందుకు దోహదపడింది. సమాంతరంగా పరీక్షలు, మూల్యాంకనం సాగడంతో ఫలితాలు జాప్యం లేకుండా వెలువడ్డాయి.

ఒకరోజు ముందుగానే..

గత ఏడాది కంటే ఒక రోజు ముందుగానే ఫలితాలు వెలువడ్డాయి. గత ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వరకు పరీక్షలు కొనసాగగా.. ఈ ఏడాది మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్‌ 16న ముగిసాయి. ఎన్నడూ లేని విధంగా సీబీఎస్‌ఈ తరహాలో నిర్వహణతో ఎనిమిది పేపర్లకు 33రోజులపాటు పరీక్షలు సాగాయి. గత ఏడాది వరకు తొమ్మిది, పది రోజులపాటు కార్మెల్‌ హైస్కూల్‌ వేదికగా మూల్యాంకనం సాగింది. విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సకాలంలో రిపోర్టు చేయకపోవడం వల్ల మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఒంటిపూట బడులు కొనసాగుతుండడం, మూల్యాంకన విధుల్లో పొద్దంతా ఉండడం ఇష్టం లేకనో ఏమోగానీ ఉపాధ్యాయులు మూల్యాంకన విధుల నుంచి తప్పించుకునేందుకు మొగ్గు చూపేవారు. అన్ని సబ్జెక్టుల టీచర్లు ఒకేసారి రావడంతో గందరగోళంగా మారేది. ఈ ఏడాది మూడు విడతలుగా మూల్యాంకనం సాగింది. ప్రతీ పరీక్షకు మూడు నాలుగు రోజుల వ్యవధి ఉండడంతో గణితం పరీక్షలు ముగియగానే మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి 9వరకు తెలుగు, హిందీ, గణితం, ఇంగ్లిషు, ఏప్రిల్‌ 10 నుంచి 17వరకు ఫిజికల్‌ సైన్స్‌, బయోసైన్స్‌, మూడో విడత ఏప్రిల్‌ 17నుంచి 23వరకు సోషల్‌ సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకనం సాగింది. దీంతో ఆయా సబ్జెక్టుల టీచర్లు మాత్రమే రావడం వల్ల సాఫీగా మారింది. గత ఏడాది ఏప్రిల్‌ 30న ఫలితాలు వెలువడగా, ఈ ఏడాది 29న వెలువడ్డాయి. గతంలో కంటే మూల్యాంకన పనిదినాలు ఎక్కువైనా ఒక రోజు ముందే ఫలితాలు వెలవడడం గమనార్హం.

సాగిందిలా..

ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆయా పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. గతేడాది 1,29,243 జవాబు పత్రాలు రాగా ఈ ఏడాది 1,31,398 పేపర్లు స్పాట్‌ కేంద్రానికి వచ్చాయి. మూల్యాంకన విధులకు ఏఈ, సీఈ, స్పెషల్‌ అసిస్టెంట్లుగా 2025లో 596 మందిని కేటాయించగా ఈసారి 645 మంది హాజరయ్యారు. అప్పట్లో మూ ల్యాంకనం తొమ్మిది రోజులు.. ఈ ఏడాది పరీక్షలకు విరామం ఉండడం.. మూడు విడతల్లో మూల్యాంకనం చేయడం(పనిదినాలు ఎక్కువైన) సులువుగా మారి ఫలితాలకు మార్గం సుగమమైంది.

Advertisement
 
Advertisement
Advertisement