మంచిర్యాలరూరల్(హాజీపూర్): జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ వేగవంతం అవుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం హాజీపూర్ మండలం సబ్బేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీయ గణనపై ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. స్వీయగణన పూర్తి చేసిన వారు ఎన్యుమరేటర్ ఇళ్ల గణనకు వచ్చిన సమయంలో స్వీయగణన నంబరు ఇవ్వాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హాజీపూర్ పీహెచ్‌సీని సందర్శించి ఫార్మసి, వార్డు, ల్యాబ్, పరిసరాలు పరిశీలించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పాతమంచిర్యాల: ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెట్రోల్‌బంక్‌లు, సోలార్‌ప్లాంట్లు, ప్లంబింగ్ రంగాల్లో ముందుకు రావాలని అన్నారు. మహిళల సామార్థ్యాల అభివృద్ధి కోసం 100 రోజుల శిక్షణ కార్యక్రమం అమలు చేస్తోందని, శిక్షణ తర్వాత ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి శ్రీలత, కోశాధికారి మాలతి, అదనపు డీఆర్‌డీఓ అంజయ్య, డీపీఎంలు స్వర్ణలత, రాజుబాయి, సారయ్య, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి
లక్సెట్టిపేట: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల, తిమ్మాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ దిలీప్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగుల రిజిష్టర్, మందుల నిల్వలు, ల్యాబ్, వార్డులు, పరిసరాలను పరిశీలించారు.


