● జిల్లాలో 97.20శాతం పాస్‌ ● రాష్ట్ర స్థాయిలో జిల్లా 20వ స్థానం ● మూడు స్థానాలు వెనక్కి.. ● బాలికలే మళ్లీ ముందంజ | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో 97.20శాతం పాస్‌ ● రాష్ట్ర స్థాయిలో జిల్లా 20వ స్థానం ● మూడు స్థానాలు వెనక్కి.. ● బాలికలే మళ్లీ ముందంజ

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

● జిల్లాలో 97.20శాతం పాస్‌ ● రాష్ట్ర స్థాయిలో జిల్లా 20వ స్థానం ● మూడు స్థానాలు వెనక్కి.. ● బాలికలే మళ్లీ ముందంజ ● ఆంగ్లంలోనూ అంతే..

మంచిర్యాలఅర్బన్‌: పదో తరగతి ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగి విద్యార్థుల్లో ఆనందం నింపింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 20వ స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతం మెరుగైనా ఫలితాల పరంగా చూస్తే రాష్ట్ర స్థాయిలో మూడు స్థానాలు పడిపోయింది. గత ఏడాది 96.54శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 97.20శాతంతో ఉత్తీర్ణత గణనీయంగా పెరిగింది. గతేడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా 17వ స్థానం సాధించగా.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 20వ స్థానంలో నిలువడం నిరాశపర్చింది. జిల్లాలో 9,684 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 9,413 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 4,879 మంది పరీక్షలకు హాజరు కాగా 4,720 మంది పాసయ్యారు. బాలికలు 4,805 మందికి 4,693 ఉత్తీర్ణత పొందారు. కాగా, బాలురు 96.74 ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 97.67 ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు.

శతశాతం పాఠశాలలు

జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాలలు శత శాతం సాధించాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత పొందారు. విద్యార్థులు కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో మొత్తం 132 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. ఇందులో 81 ప్రభుత్వ, 51 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. 18 కేజీబీవీల్లో 11 వందశాతం ఫలితాలతో దూసుకెళ్లగా.. ఐదు తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఒక్కటి కూడా శతశాాతం ఫలితాలు సాధించలేకపోయాయి.

జూన్‌లో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్‌ 5 నుంచి 12వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 నుంచి మే 14వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో యాదయ్య తెలిపారు. రీకౌంటింగ్‌కు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున 15రోజుల్లో ఎస్‌బీఐ ద్వారా చలానా చెల్లించి దరఖాస్తులను డీజీఈ హైదరాబాద్‌ కార్యాలయానికి పంపించాలని తెలిపారు.

మంచిర్యాల మోడల్‌స్కూల్‌ విద్యార్థి సంజనను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

‘లెక్క’ తప్పింది..!

మంచిర్యాలఅర్బన్‌: విద్యార్థి భవిష్యత్‌కు కీలకమైన పదో తరగతి ఫలితాల్లో గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ లెక్కల్లో తప్పారు. ఫార్ములాలు తెలియకపోవడమో, బేసిక్‌ కాన్సెప్ట్‌లు బలంగా లేకపోవడమో ఏమోగానీ మార్కులపై ప్రభావం చూపింది. గణితం తర్వాత చాలామంది ఇంగ్లిష్‌ పరీక్ష తప్పారు. భయంతో సరైన ప్రాక్టీస్‌ చేయకపోవడం కారణంగా తెలుస్తోంది. పాఠశాలలకు సక్రమంగా హాజరు కాని విద్యార్థులే లెక్కల్లో తప్పినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో 271 మంది ఫెయిల్‌ కాగా, వీరిలో గణితం పరీక్షలో 136 మంది అ నుత్తీర్ణులయ్యారు. 124 మంది ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఫెయిలయ్యారు. సైన్స్‌లో 87 మంది, తెలుగులో 53 మంది, హిందీలో 24, సోషల్‌లో 14 మంది ఫెయిలయ్యారు. సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాల్లో మంచి విజయాలు సాధించవచ్చు.

మంచిర్యాలలో అత్యధికంగా..

పదో తరగతిలో మండలాల వారీగా ఫలితాలు చూస్తే గణితం, ఇంగ్లిష్‌ ,సైన్స్‌ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు జిల్లా కేంద్రం మంచిర్యాలలోనే అత్యధికంగా ఉన్నారు. గణితంలో 39 మంది ఉంటే తర్వాత చెన్నూర్‌లో 21 మంది, బెల్లంపల్లిలో 15 మంది ఫెయిలయ్యారు. ఇంగ్లిష్‌లో మంచిర్యాలలో 28 మంది, బెల్లంపల్లి మండలంలో 15 మంది అనుత్తీర్ణులయ్యారు. మంచిర్యాలలో సైన్స్‌ సబ్జెక్టు విద్యార్థులు 28 మంది, 15 మంది తెలుగు సబ్జెక్టులో ఫెయిలయ్యారు.

నాలుగేళ్లుగా ౖపైపెకి..

పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అంతకంతకు పెరిగిపోతోంది. నాలుగేళ్లుగా పోల్చి చూస్తే విద్యార్థుల ఉత్తీర్ణత పెరగడం ఉత్సాహాన్ని నింపుతోంది. బాలికలు నిరతరంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. 2023లో 84.87శాతం, 2024లో 92.42శాతం, 2025లో 96.54 శాతం ఉత్తీర్ణత సాధించగా 2025–26లో 97.20శాతం సాధించడంతో పాఠశాల పనితీరు మెరుగైందని చెప్పవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement