మహిళా సంఘాలకు పక్కా భవనం | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు పక్కా భవనం

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

● వేగంగా సాగుతున్న నిర్మాణాలు ● నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ● ఒక్కో భవనానికి రూ.10లక్షలు కేటాయింపు

పాతమంచిర్యాల: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల పక్కా భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మండల సమాఖ్యలు, గ్రామైక్య సంఘాల(వీవో)కు భవనాలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అనువైన స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు ప్రారంభించారు. సంఘాలకు కొన్ని చోట్ల భవనాలు ఉండగా.. కొన్ని అద్దె, మండల అభివృద్ధి కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. నెన్నెల మండల సమాఖ్యకు పక్కా భవనం ఉండగా.. దండేపల్లి, మందమర్రిలో భవనాలు శిథిలావస్థకు చేరాయి. భీమారం, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలకు భవనాలు లేకపోవడంతో సభ్యులకు సమావేశాల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో ప్రతీ గ్రామైక్య సంఘానికి భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించి రూ.17.4 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున కేటాయించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు చేపడుతున్నారు. మహిళలు సమావేశాలు నిర్వహించుకునేలా నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 170 భవనాల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో 20 భవనాల నిర్మాణం పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. భీమారం మండలంలో 4, చెన్నూర్‌లో 9, జైపూర్‌లో 18, కోటపల్లిలో 11, బెల్లంపల్లిలో 26, భీమినిలో 6, కన్నెపల్లిలో 15, కాసిపేటలో 5, నెన్నెలలో 10, తాండూరులో 11, వేమనపల్లిలో 10, దండేపల్లిలో 17, లక్సెటిపేటలో 6, జన్నారంలో 22 గ్రామైక్య సంఘాలకు భవనాలు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 426 గ్రామైక్య సంఘాలు ఉండగా ప్రస్తుతం 170 భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. వేమనపల్లి, కన్నెపల్లి, బెల్లంపల్లి, భీమారం మండల సమాఖ్యల భవనాలు, జైపూర్‌ మండలంలో గోదాంల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరయ్యాయి. భవనాల నిర్మాణంతో సామగ్రి నిల్వ చేసుకోవడం, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు సౌకర్యంగా ఉంటుందని మహిళా సంఘాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement