● కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్: జిల్లాలోని రైతులు సన్న రకం వరి సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సన్న రకం వడ్లు సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందిస్తుందని, వానాకాలం సీజన్‌లో సాగు చేయాలని సూచించారు. అధిక దిగుబడి సాధించేందుకు మెలకువలు పాటించాలని అన్నారు. జిల్లాలో దాదాపు 1.57 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ప్యాడి క్లీనర్లు, తూకం యంత్రాలు, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
సైబర్ నేరాలపై
అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: సైబర్ మోసాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండే విధానాలను తెలుసుకోవాలని అన్నారు. అత్యవసర సహాయం కోసం సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, పిల్లల సమస్యల కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098లో సంప్రదించవచ్చని తెలిపారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలు, లింక్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధుసూదన్, కళాశాల ప్రిన్సిపాల్ కె.సుజాత, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్ పాల్గొన్నారు.


