గిరిజనుల కల్పతరువు ‘ఇప్ప’ | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల కల్పతరువు ‘ఇప్ప’

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

వేకువజామునే అడవిబాటలో ఆదివాసీలు వేసవిలో ఇప్పపూల సేకరణలో బిజీ గిరిపుత్రులకు జీవనోపాధి

ఉట్నూర్‌రూరల్‌:అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు వేసవికాలంలో ఇప్పపూల సేకరణలో బిజీగా ఉన్నారు. ఉట్నూర్‌ మండలంలోని దొంగచింత, నర్సాపూర్‌(జే), తాటిగూడ, బాబాపూర్‌, కామాయిపేట, దేవుగూడ, మారుతిగూడ, తదితర గిరిజన గ్రామాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూర్‌, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, జన్నారం, గాదిగూడ, ఇంద్రవెల్లి, తదితర మండలాల గిరిజనులు కోడి కూయకముందే అడవిబాట పడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే లభించే బంక, జిగురు, మొర్రి పండ్లు, తునికాకు, తునికి పండ్లు, ఇతర ఉత్పత్తులతో పాటు వేసవిలో ఇప్పపువ్వుతో గిరిజనులు ఉపాది పొందుతున్నారు. అడవిలో సేకరించిన ఇప్పపూలను ఇంటికి తెచ్చి మూడు రోజులపాటు ఎండలో ఆరబెడతారు. ఎండిన తర్వాత వాటిని విక్రయిస్తారు. ఇప్పపూల తర్వాత ఇప్ప పరక లభ్యమవుతుంది. ఇప్పపరక నుంచి నూనె తీస్తారు. నూనె తీయడానికి ‘గానె’ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇప్పపరక నూనె మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇప్పచెట్లను గిరిజనులు తమ సొంత భూముల్లో కూడా పెంచుకుంటారు.

ఆహారంగా వినియోగం

ఇప్పపూలను గిరిజనులు ఆహారంగా వినియోగిస్తారు. ఇప్పపూలను ఎండ బెట్టిన తర్వాత సలపతో బాగా దంచి మెత్తగా చేసి కుండలో వండి భుజిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సల్దిగా ఉపయోగించుకుంటారు. వేసవికాలంలో వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన సమయంలో, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి జొన్న అంబలితో పాటు ఇప్పపూలతో చేసిన వంటకాలను భుజిస్తారు. వేసవి కాలంలో గిరిజన గ్రామాల్లోని ఏ ఇంటికి వెళ్లినా జొన్న అంబలి, ఇప్పపూలు తప్పనిసరిగా లభిస్తాయి. గిరిజనుల సంప్రదాయ పండుగలకు ఇప్పపూలతో కుడుములు, గారెలు, లడ్డూలు, వడలు, తదితర వంటకాలు తయారు చేస్తారు.

పానియాలు తయారీ

గిరిజనుల సంస్కృతి, సంప్రదాయ ఉత్సవాలు, వివాహాల్లో ఉత్సాహం కోసం వారే స్వయంగా ఇప్పసారా తయారుచేసి సేవిస్తారు. వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన సమయంలో అలసట తీరేందుకు ఇప్పసారా సేవిస్తారు. ఇప్పపూల సారా తయారు చేయగా మిగిలిన ఇప్పపూలను పశువులకు దాణాగా వేస్తారు.

జీసీసీ ద్వారా కొనుగోళ్లు

ఆదివాసీలు అడవి నుంచి సేకరించిన ఇప్పపూలను గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు ఇప్పపూలకు రూ.3వేల చొప్పున ధర చెల్లిస్తూ ఆదివాసీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, సేకరించిన ఇప్పపూలను జీసీసీకి విక్రయించి ఉపాధి పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

బుట్టల్లో నింపిన ఇప్పపువ్వు

ఇప్పపూలతో తయారు చేసిన వంటకాలు

ప్రకృతి ప్రసాదించిన ఇప్ప పువ్వు గిరిజనుల కల్పతరువుగా నిలుస్తోంది. వేసవిలో అటవీ ప్రాంతంలో ఇప్ప పువ్వు, పరక, తునికి పండ్లు, మొర్రిపండ్లు విరివిగా లభిస్తాయి. కొండకోనలు, అటవీ ప్రాంతాల్లో నివసించే గోండి, కొలాం గిరిజనులు వాటిని సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. మరోవైపు ఆదివాసీల పండుగల్లో ఇప్పపూలను పిండివంటలకు వాడుతున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లు గిరిజనులకు బతుకుదెరువు చూపుతున్నాయి. వాటితో గిరిజనులకు ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం.

Advertisement
 
Advertisement
Advertisement