ముగిసిన ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ పోటీలు

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

● విజేతగా నిలిచిన కరీంనగర్‌ జట్టు ● రన్నరప్‌గా రంగారెడ్డి జట్టు

రామకృష్ణాపూర్‌: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పట్టణంలోని సింగరేణి ఠాగూర్‌ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా అండర్‌–16 బాలికల ఫుట్‌బాల్‌ పోటీలు బుధవారం ముగిశాయి. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో నిర్వహించిన పోటీల్లో కరీంనగర్‌, రంగారెడ్డి జట్లు ఫైనల్స్‌కు చేరాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో కరీంనగర్‌ జట్టు 1–0 గోల్స్‌ తేడాతో ఛాంపియన్‌గా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జట్లకు సంయుక్తంగా తృతీయ బహుమతి అందజేశారు.

క్రీడలకు సమయం కేటాయించాలి

ప్రతిఒక్కరూ క్రీడల కోసం సమయం కేటాయించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఖేలో ఇండియా పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల పట్టుదల అనేది పెంపొందుతుందని, జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే పట్టుదల అనేది చాలా ముఖ్యమన్నారు. స్థానిక ఠాగూర్‌ స్టేడియంలో టర్ఫ్‌ వికెట్‌ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మందమర్రి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, స్థానిక ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్‌ మధుకుమార్‌, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement