ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో మంద మకరందు తెలిపారు. బుధవారం బాధ్యతల స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవనోపాధి మెరుగుదలకు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావ్‌పేటకు చెందిన తాను ఐటీ ఇంజినీరింగ్‌ను 2016–17లో పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఐఏఎస్ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 2020–21లో అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో శిక్షణ పూర్తి చేసిన అనంతరం జగిత్యాల జిల్లాలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ)గా తొలి నియామకం పొందానని, ఆ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా సేవలందించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


