శ్రీరాంపూర్: భానుడి ప్రతాపానికి సింగరేణి ఓసీపీలు సుర్రుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. సాధారణ ప్రాంతాలతో పోల్చితే మైనింగ్ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. మూడురోజులుగా 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఓసీపీల్లో బొగ్గు వేడికి మరో రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతుతున్నాయి. మే లో దంచికొట్టే ఎండలు ఈ సారి ముందే ప్రతాపం చూపుతున్నాయని కార్మికులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల కన్నా ఓసీపీల్లో పని చేసేవారిపైనే తీవ్ర ప్రభావం ఉంటుంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో ఐదు ఓసీపీలున్నాయి. వీటిలో బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ, మందమర్రి పరిధిలోని కేకే, ఆర్కేపీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ, ఇందారం ఓసీపీలున్నాయి. వీటన్నింటిలో కార్మికులు ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈసారి కూడా క్వారీల్లో అధికారులు చలువ పందిళ్లు వేయించి మట్టి కుండల్లో నీటిని ఉంచుతున్నారు. కొన్నిచోట్ల కూల్ క్యాన్లు పెట్టించారు. టవల్స్, గొడుగులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఓఆర్‌ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. కొన్ని డిసిగ్నేషన్ల వారికి కూల్ బాటిళ్లు అందించారు. డంపర్లు, షవల్స్, ఇతర భారీ యంత్రాల్లో ఏసీలు పూర్తి కండిషన్ చేయించారు. కాగా, ఓసీపీల్లో మాదిరిగా అన్ని భూగర్భ గనులు, సర్ఫేస్ డిపార్టుమెంట్లు, సీహెచ్‌పీలతోపాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఓఆర్‌ఎస్, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రెండేళ్లుగా మార్చని షిఫ్ట్ వేళలు
ఓసీపీల్లో ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా ఎండదెబ్బ నుంచి కాపాడలేకపోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా గతంలో మే నెలలో పని వేళలు మార్చేవారు. రెండేళ్లుగా షిఫ్ట్ వేళలు మార్చడం లేదు. దీంతో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా యాజమాన్యం షిఫ్ట్ వేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం షిఫ్ట్ ఉదయం 7నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ఉండగా.. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3నుంచి రాత్రి 11గంటల వరకు ఉన్న సెకండ్ షిఫ్ట్‌ను సాయంత్రం 4నుంచి రాత్రి 11గంటల వరకు మార్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
షిఫ్ట్ వేళలు మార్చాలి
గత రెండేళ్ల కంటే ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నందునా షిఫ్ట్ వేళలు మార్చాలి. ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. తక్షణమే కంపెనీ దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలి. అన్ని సర్ఫేస్ విభాగాల్లో పని చేసే కార్మికులకు కూడా ఓసీపీల్లో మాదిరిగా ఉపశమన చర్యలు చేపట్టాలి
– బండి రమేశ్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు


